కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ బోర్డు ఈ ప్రకటన చేసింది. శ్రీలంక ప్రభుత్వం కూడా లీగ్ నిర్వహణకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘గతంలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం యూఏఈ క్రికెట్ బోర్డుకు ఉంది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలకు మేం ఆతిథ్యమిచ్చాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం’ అని యూఏఈ బోర్డు కార్యదర్శి ముబష్షిర్ ఉస్మానీ పేర్కొన్నారు.