టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప.. అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల్లో మొత్తం రూ. 42.34 కోట్లతో 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 8 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. కోస్గి ఆస్పత్రిని రెండు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచి, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామన్నారు. కొడంగల్‌లోనూ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.కొడంగల్ నియోజకవర్గానికి రేపోమాపో పాలమూరు ఎత్తిపోతల నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారు. అయినా పనులు ఆగవని తేల్చిచెప్పారు. త్వరలోనే కొడంగల్‌కు సాగునీరు తీసుకొస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ తాగునీటి సమస్య ఉండే.. మిషన్ భగీరథతో ఆ సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఎనిమిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఈ నియోజకవర్గానికి ఒక హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేకపోయారని హరీశ్‌రావు ప్రశ్నించారు.