పథకాలు వెనక్కి తీసుకోవాలి సుశీల్ ని వెంటనే ఉరి తీయాలి -రానా తల్లి

నా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్‌ కాలేడు. సుశీల్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న నమ్మకముంది. కానీ సుశీల్‌ ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముంది. అందుకే పూర్తి విచారణ జరిపి సుశీల్‌ను ఉరితీయాలి’
యువ రెజ్లర్‌ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌పై రోజురోజుకు తీవ్ర నిరసన వ్యక్తమవుతూనే ఉన్నది. అన్నెం పున్నెం ఎరుగని తమ కొడుకును అతి దారుణంగా హతమార్చిన సుశీల్‌ను ఉరితీయాలని సాగర్‌ రానా తల్లిదండ్రులు శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఛత్రసాల్‌ స్టేడియంలో జరిగిన ఘర్షణలో 23 ఏండ్ల సాగర్‌ను సుశీల్‌ అతని అనుచరులు హత్య చేశారన్న వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. 19 రోజుల పాటు అందరి కండ్లు గప్పి తిరిగిన సుశీల్‌తో పాటు అతని అనుచరుడు అజయ్‌ను ఎట్టకేలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఆరు రోజుల కస్టడీ విధించిన నేపథ్యంలో సుశీల్‌ను కఠినంగా శిక్షించాలంటూ సాగర్‌ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరారు. రాజకీయ ప్రోద్భలంతో హత్య కేసు నుంచి సుశీల్‌ బయటపడేందుకు ప్రయత్నించవచ్చని సాగర్‌ తండ్రి అశోక్‌ ఆరోపించారు. హత్య కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని పేర్కొన్నారు. బేగంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌ మాట్లాడుతూ ‘కొడుకును హతమార్చిన ఘటనలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. హత్య జరిగిన తర్వాత సుశీల్‌ తలదాచుకునేందుకు ఎక్కడికెక్కడి వెళ్లాడు? అతనికి ఎవరు అవాసం కల్పించారు? ఈ కేసులో సుశీల్‌కు సహకరించిన క్రిమినల్స్‌ ఎవరు? వీటన్నంటిపై పూర్తిగా విచారణ జరుపాలి. సుశీల్‌తో పాటు హత్యలో పాలుపంచుకున్న వారిని ఉరి తీసి అమాయకుల ఉసురు పోసుకుంటే ఇదే గుణపాఠమని చూపించాలి’ అని అన్నాడు.
రానా హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సుశీల్‌ కుమార్‌ రైల్వే ఉద్యోగానికి ఎసరు వచ్చి పడింది. నార్తర్న్‌ రైల్వేలో ప్రస్తుతం ఉద్యోగిగా వ్యవహరిస్తున్న సుశీల్‌…కేసులో దోషిగా తేలితే ఉద్యోగం కోల్పోతాడని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ‘సుశీల్‌ హత్య కేసుపై ఆదివారం రైల్వే బోర్డుకు ఢిల్లీ ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే..అతనిపై కచ్చితంగా వేటు పడుతుంది.’ అని సీపీఆర్వో దీపక్‌ అన్నారు.యువ రెజ్లర్‌ సాగర్‌ రానాను హతమార్చిన కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ ఉదంతంలో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. అసలు రానాను హత్య చేయడానికి గల కారణాలేంటో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీలోని మోడల్‌ టౌన్‌ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ ఈ హత్య ఉదంతానికి ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా రాష్ర్టాలకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అయిన సందీప్‌ కాలా అలియాస్‌ కాలా జతేదితో సుశీల్‌కు మెరుగైన సంబంధాలు వెలుగు చూశాయి. అయితే సందీప్‌కు అల్లుడు అయిన సోను మహల్‌..ఛత్రసాల్‌ స్టేడియంలో జరిగిన ఘర్షణలో రానాతో పాటు గాయపడ్డాడు. సోనుపై ఇప్పటికే 19 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఘర్షణ జరిగినప్పటి నుంచి సందీప్‌ వర్గంతో సుశీల్‌కు ఒక రకంగా వైరం ఏర్పడింది. అదే సమయంలో ప్రముఖ క్రిమినల్‌గా పేరొందిన నీరజ్‌ భావ్న గ్యాంగ్‌..సుశీల్‌కు మద్దతుగా నిలిచింది. హత్య జరిగిన సమయంలో నీరజ్‌ గ్రామానికి చెందిన స్కార్పియో లభించడం అనుమానాలను బలపరుస్తున్నది.రెజ్లర్ల భూదందా..దేశ రాజధాని ఢిల్లీలో కొందరు రెజ్లర్ల భూదందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కనిపించిన స్థలాలు, బిల్డింగ్‌లను కబ్జా చేస్తూ అందినకాడికి దోచుకోవడం రెజ్లర్లకు అలవాటుగా మారింది. ఎవరైనా వడ్డీకి డబ్బులు తీసుకుని చెల్లించకపోతే వారి ఆస్తులను బలవంతంగా జప్తు చేసి సదరు ఫైనాన్షియర్లకు ఇవ్వడం రెజ్లర్లు చేస్తున్న పని. ఈ క్రమంలో నయానో, భయానో బెదిరించడం రెజ్లర్లకు నిత్యకృత్యంగా మారిందని చెప్పొచ్చు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews