ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ముఖ్యంగా భారత్‌, పాక్‌ ప్రతినిధుల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో అజెండా ఖరారు.. ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. ఐసీసీ నూతన చైర్మన్‌ ఎన్నిక అనేది ఇప్పుడున్నట్టుగానే మూడింట రెండొంతుల మెజార్టీ ప్రకారం జరగాలని బోర్డులోని పలువురు సభ్యులు, పీసీబీ ప్రతినిధులు వాదించారు. కానీ భారత్‌, ఆసీస్‌, ఇంగ్లండ్‌ ప్రతినిధులతో పాటు అధిక శాతం సభ్యులు మాత్రం సాధారణ మెజారిటీ ద్వారానే ఎన్నిక జరగాలని స్పష్టం చేశారు. దీంతో శశాంక్‌ మనోహర్‌ స్థానంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఎటూ తేలకుండానే ముగించాల్సి వచ్చింది. ‘ఐసీసీలో 17 ఓట్లున్నాయి. మూడింట రెండొంతుల మెజార్టీ ప్రకారం ఎన్నిక జరగాలంటే చైర్మన్‌ అభ్యర్థికి 12 ఓట్లు అవసరమవుతాయి. అదే సాధారణ మెజార్టీ ప్రకారం జరిపితే తొమ్మిది ఓట్లు వచ్చినా విజేతగా నిలుస్తాడు’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఐసీసీ సమావేశంలో బోర్డు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు కనిపించింది. భారత్‌, ఇంగ్లండ్‌, ఆసీస్‌, దక్షిణాఫ్రికా సహా మరో ఏడుగురు సభ్యదేశాలు ఓవైపు ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, స్వతంత్ర డైరెక్టర్‌ ఇంద్రా నూయి, పీసీబీ, ముగ్గురు అసోసియేటెడ్‌ సభ్యులు మరోవైపున్నారు. ‘ప్రస్తుతానికైతే ఐసీసీలో భారత్‌ వర్సెస్‌ పాక్‌ గేమ్‌ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడీ పరిస్థితిలో బోర్డు ఏదో ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీ ప్రకారమే కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది’ అని బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews