ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఐపిఎల్ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున ఐపిఎల్‌ను విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్‌నవంబర్ మధ్యలో ఐపిఎల్ షెడ్యూల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.కరోనా తీవ్రత తక్కువగా ఉన్న యుఎఇలో ఈ ఏడాది ఐపిఎల్‌ను నిర్వహించాలనే యోచనలో తామున్నట్టు తెలిపారు. కాగా, విదేశీ గడ్డపై ఐపిఎల్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం అని బ్రిజేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.