మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్లో కీలక మలుపు అని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో భువీ చెప్పాడు.“ఎంఎస్ ధోనీలా.. ఫలితం గురించి పట్టించుకోకుండా.. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెడుతూ శక్తిమేర రాణిస్తూ.. మ్యాచ్‌పై ఏకాగ్రతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది ఓ ప్రక్రియ ప్రకారం వస్తుంది. ఐపీఎల్లో రెండు సీజన్లు బాగా రాణించా. ఆ సమయంలో ఈ ప్రక్రియపై ఎక్కువ ఏకాగ్రత పెట్టా. తుది ఫలితం తర్వాతి విషయం అనుకున్నా. మొత్తానికి ఫలితాలన్నీ సానుకూలంగానే వచ్చాయి” అని భువనేశ్వర్ చెప్పాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడడం వల్ల చివరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడి మధ్య తన బౌలింగ్ ఎంతో మెరుగైందని భువీ అన్నాడు. అలాగే కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో కొన్ని దురదృష్ట ఘటనల కారణంగానే.. ఎంత బాగా ఆడినా ఏడేండ్లుగా టీమ్ఇండియా ఐసీసీ మెగాటోర్నీ టైటిల్ సాధించలేకపోతున్నదని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు.