భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ మంత్రి మహిందానంద అలుత్ గమాగే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర లేదని కొన్ని పార్టీలు పాలుపంచుకున్నాయన్న నేపథ్యంలో నిజానిజాలేంటో తెలుసుకునేందుకు లంక క్రీడా శాఖ మంత్రి దుల్లాస్ అలాహప్పెరుమా సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. విచారణకు సంబంధించిన వివరాలను ప్రతి రెండు వారాలకోసారి నివేదిక సమర్పించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి మహిందానంద ఆరోపణల్లో ఉన్న అసలు వాస్తవాలేంటో దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశముంది. 2011 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం ఇనాటిది కాదు. గతంలోనూ ఈ అంశం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. సరిగ్గా మూడేండ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ..వరల్డ్‌కప్ తుదిపోరుపై విచారణ జరుపాలంటూ డిమాండ్ చేశాడు. అప్పటి ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ మాజీ కెప్టెన్ లంక ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెప్పుకొచ్చాడు. ‘ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడేం చెప్పలేను, కానీ ఏదో ఒక నాడు నిజం బయటపెడుతాను. అందుకే దీనిపై విచారణ జరుపాలనుంటున్నాను’ అని రణతుంగ అన్నాడు. మళ్లీ ఇన్ని రోజులకు అప్పటి క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించిన మహిందానంద ఆరోపణలు దిగడం విశేషం. భారత్‌కు లంక ప్రపంచకప్ అమ్ముకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్థానిక వార్త సంస్థతో మాట్లాడుతూ ‘భారత్, లంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఫిక్సయింది. లంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యఛేదనలో గంభీర్(97), ధోనీ(91) అర్ధసెంచరీలతో భారత్..ప్రపంచకప్ టోర్నీని ముద్దాడింది. కానీ ఆ రోజు లంక కప్‌ను భారత్‌కు అమ్ముకుంది. ఆ దేశ మంత్రిగా నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇందులో ఆటగాళ్ల భాగస్వామ్యం లేకపోయినా..కొన్ని వర్గాలు ఇందులో పాలుపంచుకున్నారు’ అని మహిందానంద అన్నాడు. ఫిక్సింగ్ వ్యాఖ్యలపై అప్పటి లంక కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మహేల జయవర్దనే దీటుగా స్పందించారు.