ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అంశం.. బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తున్నది. టీ20 విశ్వటోర్నీపై తుది నిర్ణయం ప్రకటించడాన్ని ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీసీసీఐ భావిస్తున్నది. మెగాటోర్నీ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ జరుపాలనుకుంటున్న తమ ప్రణాళికలకు ఆటంకం కలిగించేందుకు ఐసీసీ ఇలా ప్రవర్తిస్తున్నదని గుర్రుగా ఉంది. టీ20 మెగాటోర్నీని నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా లేకున్నా.. వ్యూహాత్మకంగానే ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కాలయాపన చేస్తున్నారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి బుధవారం అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ను పక్కనబెడితే టోర్నీపై ఏదో ఒకటి తేలిస్తే అన్ని దేశాలు భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటాయని ఆ అధికారి అన్నారు. అయితే టీ20 ప్రపంచకప్ జరిపేందుకు ఆస్ట్రేలియా సుముఖంగా లేకపోవడంతో ఐసీసీ చేయగలిగిందేమీ లేదని, నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని బీసీసీఐ కోశాధికారి ధుమాల్ సైతం అన్నాడు.