ఆస్ట్రేలియా ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లు నరకాన్ని చవిచూశారని భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ నేర్కొన్నాడు. గ్రేగ్ చాపెల్ ప్రధాన కోచ్‌గా ఉన్నకాలం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సమయంగా హర్భజన్ సింగ్ అభివర్ణించాడు. చాపెల్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత క్రికెటర్లు చాలా మంది మానసిక వ్యధకు గురయ్యారన్నాడు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి క్రికెటర్‌ను గ్రేగ్ చాపెల్ ఎంతో వేధించాడని భజ్జీ వాపోయాడు. ఓ ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న హర్భజన్ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. తన కెరీర్‌లో చాపెల్ వంటి నిరంకుశ కోచ్‌ను చూడలేదన్నాడు. ఏ కారణం లేకుండానే అతను ప్రతి ఒక్కరితో గొడవకు దిగేవాడని, గంగూలీ, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి సీనియర్లను కూడా వేధించేవాడన్నాడు. అతను హయాంలో ఎవరికీ తుది జట్టులో స్థానం ఉంటుందో, ఎవరిదీ ఉండదో తెలిసేది కాదన్నాడు. కారణం లేకుండానే ఆటగాళ్లను తుది జట్టు నుంచి తొలగించే వాడన్నాడు. దీంతో ప్రతి క్రికెటర్ ఎంతో మనో వేదనకు గురయ్యే వాడని పేర్కొన్నాడు.