భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు. సెలక్షన్ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోయిందన్న తివారీ… నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో నాలుగో నంబర్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు.సిరీస్‌ల కోసం టీమిండియాను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సమావేశాలను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పించినప్పుడు కనీసం అతనికైనా కారణం చెప్పాలని కోరాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్ర వ్యక్తి కాబట్టి హనుమ విహారికి, వెస్ట్‌జోన్‌కి చెందిన వ్యక్తి అధికారంలో ఉండగా వసీమ్ జాఫర్‌కు, నార్త్‌జోన్ వ్యక్తి సెలెక్టర్‌గా ఉన్న కాలంలో గురుకీరత్ సింగ్, రిషీ ధావన్‌లకు అవకాశాలు వచ్చాయని భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారీ ఆరోపించాడు.