తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి మరీ పెద్ద పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వారు ఇవాళ ఓఎస్డీలుగా, ఎస్పీలుగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి నియామకాల కారణంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిరాటంకంగా సాగుతోందని తెలిపారు.నర్సింగ్ రావు, వేణుగోపాల్ రావు, కిషన్ రావు, మదన్ మోహన్ రావు, విజయ్ కుమార్ రావు, వెంకట్రావు, రమణారావు, రాఘవరావు, వెంకటరమణారావులు రిటైరైనా వారిని తెచ్చి కీలక పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వీరిలో చాలామంది కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయడానికి పలు కీలక శాఖల్లో నియమితులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరందరూ ఎస్ఐబీల్లో, ఇంటెలిజెన్స్ విభాగంలో, ఏసీబీలో, పోలీస్ అకాడమీలో పదవులు పొందారని వివరించారు. ఎంతో సమర్థవంతమైన అధికారులు ఉన్నా, వారిని పక్కనబెట్టారని, తనవారిని తీసుకువచ్చి ప్రత్యర్థుల ఆనుపానులు కనిపెట్టి సమాచారం అందించే బాధ్యతలు అప్పగించారని కేసీఆర్ పై మండిపడ్డారు.