వన్డే ప్రపంచకప్-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తుండటంతో శ్రీశాంత్‌తో పాటు అతడి అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిషేధం ముగియగానే కేరళ తరుపున రంజీల్లో ఆడిస్తామని అక్కడి అసోసియేషన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితేనే రెగ్యులర్‌గా అవకాశాలు ఇస్తామని కేరళ జట్టు కోచ్ తెలిపారు.కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీశాంత్ తానేంటో నిరూపించుకుంటానని, తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందనే విషయాన్ని రుజువు చేసుకుంటానన్నాడు. ‘2023 వన్డే ప్రపంచకప్‌ను నేను ఆడగలనని బలంగా విశ్వసిస్తున్నా. నా లక్ష్యాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. వాస్తవానికి ప్రతి అథ్లెట్ టార్గెట్స్ కూడా అలానే ఉంటాయి. ఉండాలి కూడా. ఒకవేళ అథ్లెట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే సాధారణంగా మారిపోతాడు’ అని 37 ఏళ్ల శ్రీశాంత్ పేర్కొన్నాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం