కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే.. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఆఫర్ లెటర్‌ను అందజేశారు. దీని పట్ల కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి స్పందించారు. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి తెలంగాణ సర్కార్ డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందజేసిందని, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాలని ఎంపీ అభిషేక్ సింఘ్వి అభిప్రాయపడ్డారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.తెలంగాణ సీఎం కేసీఆర్.. సైనిక కుటుంబాన్ని ఆదుకున్న తీరును ఆయన ప్రశంసించారు. కల్నల్ సంతోష్‌బాబు కుటుంబం అనుభవిస్తున్న బాధను తీర్చేందుకు.. తెలంగాణ సర్కారు వేగంగా స్పందించిన తీరను ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణ ఫాలో అవుతున్న విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని సింఘ్వి తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట వెళ్లి.. కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. కల్నల్ కుటుంబసభ్యులకు చెక్, జాబ్ ఆఫర్‌తో పాటు ఇంటి స్థలానికి చెందిన పత్రాల్ని అందించారు.