తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలిలో భళ్ళాలదేవుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు రానా. ఈ సినిమాతో రానా క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు అరణ్య అనే సినిమాలు చేస్తున్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఏనుగుల సంరక్షుకుడిగా ఆయన పాత్ర ప్రేక్షకులకి మంచి థ్రిల్ కలిగిస్తుందని అంటున్నారు. ఏప్రిల్‌లోనే విడుదల కావలసిన ఈ చిత్రం లాక్‌డౌన్ వలన వాయిదా పడింది.
అతి త్వరలో విడుదల కానున్న అరణ్య సినిమాకి సంబంధించిన ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు రానా. అడవులలో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. నా భుజాలపై ఏనుగు తొండాన్ని మోయాల్సి వచ్చేది. ఆ తొండం బరువు సుమారుగా 160-170 కేజీల వరకు ఉండేది. బాహుబలిలో చేయడం కన్నా అరణ్యలో నటించడం చాలా కష్టంగా అనిపించిందని రానా చెప్పుకొచ్చాడు. హిందీలో ఈ చిత్రాన్ని హాథీ మేరే సాథీ అనే పేరుతో విడుదల చేయనున్నాడు దర్శకుడు ప్రభు సోలోమాన్. తమిళంలో కాదన్ పేరుతో రిలీజ్ కానుంది. సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.