నటుడు సోనూ సూద్ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ తన దర్యాప్తును మరింత విస్తృతం చేస్తూ శుక్రవారం ముంబయిలోని అనేక నివాస భవనాలపై దాడులు నిర్వహించింది. 48 ఏళ్ల సోనూ సూద్‌కు చెందిన నివాసాలతోపాటు ఆయనకు సంబంధించిన కొందరు వ్యక్తుల ఇళ్లపై బుధవారం దాడులు జరిపిన ఐటి శాఖ అధికారులు శుక్రవారం కూడా సోదాలను కొనసాగించారు. శుక్రవారం నగరంలోని అనేక చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం ముంబయితోపాటు లక్నోలోని దాదాపు అరడజను ప్రాంతాలలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. సోనూ సూద్‌కు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ ఒప్పందంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై ఐటి శాఖ దర్యాప్తు చేస్తోందని వర్గాలు తెలిపాయి.గత ఏడాది కరోనా సంక్షోభ సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కాలినడకన తమ సొంత ఇళ్లకు పయనమైన వేలాదిమంది వలస కూలీలను వారి గమ్యస్థానాలకు చేరవేయడంతోపాటు వారికి అండగా నిలబడి సోనూ సూద్ దేశప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సోనూ సూద్‌ను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దేశ్ కా మెంటర్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది. కష్టకాలంలో తమను ఆదుకున్న సూద్‌కు దేశంలోని లక్షలాది కుటుంబాల ఆశీస్సులు ఉన్నాయంటూ గత శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.