ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు అమెరికాతో స్నేహం అవసరమని యూఎస్ హౌజ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎలియట్ ఏంజెల్, ర్యాంకింగ్ మెంబర్ మైఖేల్ టీ మెకౌల్ తదితరులు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు ఓ లేఖ రాశారు.జమ్మూ కశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత కూడా అక్కడ పరిస్థితి చక్కబడకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని జై శంకర్ కు రాసిన లేఖలో ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులను అణచి వేసేందుకు ఇండియా చేపట్టిన కార్యక్రమాల గురించి తమకు కొంత మేరకు తెలుసునని, ఈ విషయంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని అన్నారు. ఈ విషయంలో భిన్నత్వంలో ఏకత్వమన్న విధానంతో ఇరు దేశాలూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.