అమెరికా ప్రభుత్వానివి తెలివితక్కువ మాటలు -పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్

ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమంచిన తాలిబన్లకు పాకిస్థాన్ గట్టి మద్దతుదారు అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తమతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాలుపంచుకుంటూనే, మరోవైపు ఆఫ్ఘన్ లో తాలిబన్లకు సహకారం అందిస్తోందంటూ బ్లింకెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ 20 ఏళ్లలో పాక్… ఆఫ్ఘన్ లో ఏంచేసిందన్నది తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. అవి అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలని కొట్టిపారేశారు. అమెరికా ప్రభుత్వం ఇంతటి తెలివితక్కువ వ్యాఖ్యలు చేయడం గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు.“మమ్మల్ని వారు ఒక అద్దె తుపాకీలా భావించారు. ఆఫ్ఘనిస్థాన్ పోరాటంలో వారిని మేం గెలిపించాలని ఆశించారు. కానీ మేం ఎన్నటికీ అలా చేయలేదు. ఆఫ్ఘన్ భూభాగంపై సైనికపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేరని అమెరికా వర్గాలను పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాను. అక్కడ తాలిబన్ల బలాన్ని గుర్తించి వారితో రాజకీయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని అమెరికాకు సూచించాను. కానీ అదేమీ లేకుండానే అమెరికా అక్కడి నుంచి నిష్క్రమించింది” అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాలిబన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ను కూడా ఆక్రమించాక ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇదే. ఈ సందర్భంగా ఆయన అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించారు.ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ల హవా మొదలైన తర్వాత తాను ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడలేదని వెల్లడించారు. “బైడెన్ ఎంతో బిజీగా ఉంటారని ఊహించగలను. కానీ పాక్-అమెరికా సంబంధాలు ఒక్క ఫోన్ కాల్ పై ఆధారపడిలేవని మాత్రం గట్టిగా చెప్పగలను” అని స్పష్టం చేశారు. ఇక, ఉగ్రవాదులను పెంచిపోషిస్తోందని, ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంలా మారుతోందని అమెరికా పదేపదే పాక్ పై ఆరోపణలు చేస్తుండడం పట్ల ఇమ్రాన్ అసహనం వ్యక్తం చేశారు. “ఏమిటీ స్వర్గధామాలు? పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల పొడవునా అమెరికా డ్రోన్లు నిశితంగా నిఘా వేస్తుంటాయి. ఏవైనా ఉగ్రస్థావరాలు ఉంటే వారికి తెలియదా?” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “మరొకరి యుద్ధం కోసం నా దేశాన్ని బలిచేయలేను” అని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews