ఇప్పటి వరకు కేవలం చిన్న సినిమాలకే పరిమితం అయిన డిజిటల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వచ్చేలా కనపడుతోంది. ఇప్పటికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో కనిపించబోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీ సినిమాకు దాదాపు 30 కోట్లు ఇచ్చేందుకు పలు సంస్థలు రెడీగా ఉన్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ‘రెడ్’ మూవీ మాత్రం థియేటర్లోనే రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. అయితే.. మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ‘క్రాక్’ ను డిజిటల్ రిలీజ్ చేసేందుకు తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. నిర్మాత ఠాగూర్ మధుతో ఇప్పటికే పలు సంస్థలు ఓటీటీ రిలీజ్ గురించి చర్చించినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమా మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో.. దర్శకుడు గోపిచంద్ మలినేని ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకొని సమాచారం ఇస్తే ఎప్పుడంటే అప్పుడు వస్తానని రవితేజ చెప్పినట్లు తెలుస్తోంది. బెస్ట్ డీల్ వస్తుందంటే ఓటీటీ రిలీజ్ అయితే తప్పేముంది అన్న ఆలోచనతో రవితేజ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.