మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తిసామర్ధ్యాలను తెలియజేసిందని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. లడఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్రధాని అక్కడ సైనికులకు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆకస్మిక పర్యటన చేశారు. మీలో ఉన్న ధైర్యం.. మీరు పోస్టింగ్‌లో ఉన్న ప్రదేశం కన్నా ఎత్తైందని మోదీ సైనికులతో పేర్కొన్నారు. గాల్వన్ లోయలో జరిగిన దాడిలో అమరులైన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. మీ త్యాగాలు, బలిదానాలు, పోరాటం వల్లే ఆత్మనిర్భర భారత్ సంకల్పం నెరవేరుతుందని సైనికులను ఉద్దేశించి మోదీ తెలిపారు. 14కార్ప్స్ దళాలు చూపిన తెగువను ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారన్నారు. మీరు ప్రదర్శించిన ధైర్యసాహాసాలు ప్రతి ఒకరి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. మీలోని అగ్నిని, ఆవేశాన్ని.. భారతమాత శత్రువులు చూశారన్నారు. బలహీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించరని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్యమైందని ప్రధాని అన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలోనైనా, శాంతి సమయంలోనైనా, అవసరం వచ్చినప్పుడు మన సైనికుల ధైర్యాన్ని ప్రపంచం చూసిందని, శాంతి కోసం కూడా మన సైనికులు పనిచేశారని మోదీ అన్నారు. ఉత్తమమైన మానవ విలువల కోసం మనం పనిచేశామని ప్రధాని తెలిపారు. వేణువును వాయించిన కృష్ణ భగవానుడిని పూజించామని, అలాగే సుదర్శన చక్రాన్ని వాడిన ఆ భవంతుడినే మనం పూజించామని తెలిపారు. సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసిందని, ఇప్పుడు అభివృద్ధి యుగంలో ఉన్నామన్నారు. సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయని, అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయన్నారు. ఇక్కడ నేను మహిళా సైనికుల్ని చూస్తున్నానని, కదనరంగంలో ఇలాంటి సందర్భం ప్రేరణను కలిగిస్తుందని, మీ వైభవం గురించే నేను మాట్లాడుతున్నానని సైనికులను ఉద్దేశించి మోదీ అన్నారు. సైనిక మౌళికసదుపాయాలపై వ్యయాన్ని సరిహద్దుల్లో మూడు రెట్లు పెంచామన్నారు. లేహ్ నుంచి.. లడఖ్, సియాచిన్, కార్గిల్, గాల్వన్ సెలయేళ్ల నుంచి .. ప్రతి పర్వతం, ప్రతి కొండ.. భారతీయ సైనికుల సత్తాను చూసిందన్నారు.