కరోనాతో కోలుకున్నవారికి ఇంటికి రావొద్దంటున్న బంధువులు

మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పక్షవాతంతో బాధపడేవారు, మానసిక సమస్యలు ఉన్నవారున్నారు. ‘చికిత్సలతో మీకు కరోనా తగ్గిపోయింది. వైరస్‌ లేదు. ఇక ఇంటికి వెళ్లవచ్చు’ అని వైద్యులు చెప్పడంతో ఎంతో ఆనందించారు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని, తమవారు వచ్చి అక్కున చేర్చుకుంటారని ఆశించారు. రోజులు గడిచినా వారి ఆశ తీరలేదు. అప్పుడే ఇంటికి వద్దంటూ అయినవారు విముఖత చూపుతుండటంతో తల్లడిల్లుతున్నారు. ‘ఇప్పటికే పలుమార్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాం. రకరకాల కారణాలు చూపి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు’ అని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. వేరేదారి లేక ఆసుపత్రిలోనే ఉంచి సిబ్బంది సపర్యలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా గాంధీకి కరోనా రోగుల తాకిడి పెరుగుతోంది. వారికి సేవలు అందించడానికే ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. ఇక కోలుకున్నవారిని సైతం ఇక్కడే పెట్టుకోవడం ప్రమాదమని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వారంతా కరోనా లేకపోయినా వివిధ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మళ్లీ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, తక్షణం ఇళ్లకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్నవారిని తీసుకెళ్లే విషయంలో వారి కుటుంబసభ్యులు ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చూపిస్తున్నారు. తమ ఇంట్లో ఒకే గది ఉందని.. చిన్న పిల్లలు ఉన్నారని, వైరస్‌ తమకు కూడా సోకే ప్రమాదం ఉందంటూ పేర్కొంటున్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండటం వల్ల వారి ఆరోగ్యానికి భరోసాగా ఉంటుందని ఇంకొందరు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల చాలామందికి ఉపాధి కరవైంది. కుటుంబ పోషణే భారంగా మారుతోంది. అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ ప్రభావం మానవ సంబంధాలపైనా పడుతోంది. ఇంట్లో కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యం పాలైతే పట్టించుకునే దిక్కు ఉండటం లేదు. వైరస్‌ సోకితే మరింత కుంగిపోతున్నారు. కొన్నిసార్లు కడ చూపునకు కూడా నోచుకోలేని స్థితిలో చాలామంది మృతదేహాలను జీహెచ్‌ఎంసీ సిబ్బందే దహనం చేస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews