మైమరపించే అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించే అందాల తార లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ భామ. మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచిన లావణ్య మోడల్‌గా రాణించి సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో అందాల రాక్షసి, మనం, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తున్న ఆమె హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుంది. తెలుగు సినిమాల్లో నటించడమంటే తనకెంతో ఇష్టమని… టాలీవుడ్‌పైనే తన దృష్టంతా అని చెబుతోంది లావణ్య త్రిపాఠి.
తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ “తెలుగు, తమిళ్ సినిమాల్లో ఎక్కువగా సంప్రదాయమైన పాత్రలు చేశాను. అలా ఎప్పుడూ మంచి అమ్మాయిగా కనిపిస్తుంటే నాకే బోర్ కొడుతోంది. అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. నాకు సంప్రదాయ నృత్యంలో మంచి ప్రవేశం ఉంది. తెరపైన అలాంటి పాత్ర చేయాలని ఉంది. అదేవిధంగా నటనకు ప్రాధాన్యమున్న గ్లామరస్ పాత్రలో నటించడానికి కూడా నేను సిద్ధమే. ఇక సినిమా షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ నా చేతికి వచ్చాక కాసేపు ఒంటరిగా కూర్చొని ఎలా నటించాలా అని ఆలోచిస్తాను. కెమెరా ముందుకు రాకముందే డైలాగులన్నీ చదువుకుంటాను. ముఖ్యంగా సహజంగా నటించడానికి ప్రాధాన్యమిస్తాను. విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక”అని పేర్కొంది.