రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. గజ్వేల్ సభలో 2 లక్షల మందితో కదం తొక్కామని చెప్పారు. గంజాయి మత్తులో చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్యచేస్తే పోలీసులను పిలిచి కనీసం సమీక్ష చేయని సీఎం కేసీఆర్ ఓ మానవ మృగమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌కు డ్రామారావు బ్రాండ్ అంబాసిడరని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఎర్రవల్లి ఫాంహౌస్ ఓ అవినీతి తోట అని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో సాధారణ వ్యక్తి అయిన కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు, ఆస్తులు, అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద సాయాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని, రూ.లక్ష కోట్ల సబ్‌ప్లాన్ బకాయిలను చెల్లించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకరిని తొలగించి దళితులకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్‌లని చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కారును గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం, స్వయం పాలన ఉంటుందని చెప్పారు.