దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరు స్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుదిక్కుల్లో ఉన్న చింతకాని, తిర్మలగిరి, చార గొండ, నిజాం సాగర్ మండలాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలుపై సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నాలుగు మండ లాల్లో దళిత బంధు అమలుకు దశల వారీగా 2,3 వారాల్లోగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మండలాల అధికా రులు గ్రామాలకు తరలాలని ఆదేశించారు.