మొన్నటి వరకు బాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్‌ని కూడా వణికిస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా ప్రముఖ దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్ అని తేలింది. గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం తేజ ముంబై వెళ్లినట్టు తెలుస్తుండగా, అక్కడ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.తేజకి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో యూనిట్ సబ్యులతో పాటు ఆయన కుటుంబానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికి నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం తేజ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇటీవల తేజ కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో మనం ఎప్పుడెప్పుడు చేతులకు శానిటైజేషన్ చేసుకోవాలో, మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తేజ వివరించారు. కాగా, కొద్ది రోజుల క్రితం దర్శకుడు రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.