కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరో పదేళ్ల పాటు ప్రపంచ ప్రజలపై కరోనా తన ప్రభావాన్ని చూపుతుందని డబ్ల్యూహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ స్పష్టం చేశారు. పదేళ్ల పాటు ప్రజలు కరోనాతో సహజీవనం చేయకతప్పదని ఆయన పేర్కొన్నారు. కరోనాపై చర్చించేందుకు ఇటీవల డబ్ల్యూహెచ్ఒ ఎమర్జెన్సీ టీమ్ భేటీ అయింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే భౌతిక దూరం పాటించడం, మాస్కులు దరించడం, శానిటైజర్లను వినియోగించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ వెల్లడించారు. కరోనా లాంటి అంటు వ్యాధులు వందేళ్లకొకసారి వస్తాయని, అటువంటి అంటు వ్యాధుల ప్రభావం దశాబ్దాల పాటు సమాజంపై ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణతో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించడం ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పొదుపు చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. పొదుపు చేయలేని పక్షంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకతప్పదని ఆయన స్పష్టం చేశారు.