ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని ప్రభుత్వ బంగళాను ఆగస్టు లోపు ఖాళీ చేయాలని జూలై1న పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం ప్రియాంక గాంధీ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసత్యపు వార్త. బంగళాలో ఉండేందుకు కాల పరిమితి పెంచాలని నేను ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన పెట్టుకోలేదు. నేను జూలై 1న పొందిన లేఖ ప్రకారం ఆగస్టు 1లోగా లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేస్తాను’ అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా స్పందిస్తూ.. ‘మాపై వస్తున్న వార్తలు నిజం కాదు. బంగళాలో ఉండేందుకు మేము ఎటువంటి పొడగింపు అడగలేదు. నెల రోజుల్లో బంగ్లాను ఖాళీ చేయాలని లేఖ వచ్చింది. ఆ మేరకు మేము ఇంటి సామాన్లను ప్యాక్ చేశాము. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే వారం రోజుల ముందుగానే ఖాళీ చేస్తాము’ అని ఆయన ట్విటర్‌లో తెలిపారు.