ఈ ఏడాది జూన్ నాటికి పాకిస్థాన్ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్ కాల్పులకు తెగబడుతోంది. భారత స్థానాలను లక్ష్యంగా చేసుకుని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ నిబంధనలను పాటించకపోవడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం నాడు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు పలుమార్లు కాల్పులకు తెగబడ్డాయి. ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు మరణించారు. సరిహద్దుల చొరబాటుకు ఉగ్రవాదులకు పాకిస్థాన్ దళాలు నిరంతరం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఎల్‌ఏసీ వెంట ఉద్రిక్తత నెలకొన్న సమయంలోనే పాక్ మరింతగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.