పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. పివి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పేరుతో సంస్కరణలకు తెరతీశారని కొనియాడారు. వారసత్వంగా వచ్చిన 800 ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు పంచారని, సంస్కరణలను తన కుటుంబంతోనే ప్రారంభించిన గొప్ప వ్యక్తి అని, అందుకనే పివిని తెలంగాణ ఠీవి అంటున్నామన్నారు. పివి జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలు జరగాలన్నారు. పివి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవని, భూసంస్కరణలకు ఆద్యులు, గొప్ప సంస్కరణ శీలి, నిశ్చల, గంభీర వ్యక్తిత్వం, 360 డిగ్రీస్ పర్సనాలిటీ పివిదని మెచ్చుకున్నారు. ప్రధాని అయ్యేసరికి దేశం గందరగోళ పరిస్థితుల్లో ఉందని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టారని, ఆయన చేసిన సంస్కరణల వల్లే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని కెసిఆర్ తెలియజేశారు. పివి నర్సింహారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు ఆద్యుడు పివి అని, సర్వేల్‌లో తొలి గురుకుల పాఠశాలను పివి ప్రారంభించారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలు పివి చొరతో ప్రారంభించారన్నారు. ఆయన తన చిన్న నాటి నుంచి ఎన్నో పోరాటాలను చూసి స్ఫూర్తి పొందారని, తన పాలనలో భూసంస్కరణలు అమలు చేశారని, ఆయన పాలనలో మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పివి నిలిచారని, ఇంతటి మహోన్నత వ్యక్తికి లభించాల్సిన గౌరవం దక్కలేదని బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ పివి పేరు ప్రఖ్యాతలను ముందు తరాలకు తెలియజేస్తామన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు పివి సలహాలు తీసుకునేవారని కెసిఆర్ గుర్తు చేశారు. పివి నరసింహారావు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.