కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.‘మనందరి జీవితాల్లో ఎత్తు పల్లాలుంటాయి. మన మన సామాజిక జీవితాల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ప్రపంచమంతా ఒకే సమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. వాక్సిన్ వచ్చేంత వరకూ రెండు గజాల దూరం పాటించాలి. మాస్కులను తప్పకుండా ధరించాలి. కరోనా సోకకుండా చూసుకోవాలి.’’ అంటూ మోదీ సూచించారు.ప్రధాన మంత్రి రోజ్‌గార్ అభియాన్ యోజన పనిశక్తిపైనే ఆధారపడి ఉందని, ఈ పథకానికి అదే ప్రేరణ అని ప్రకటించారు. యూపీ లాగా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను తెస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో యూపీ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో పని చేసిందని, కరోనాతో పోరాడుతోందని మోదీ ప్రశంసించారు.