బాలీవుడ్ నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల దేవుడిగానే గుర్తుకొస్తారు. కష్టంలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా మారి లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో చిక్కుకుని ఉపాధికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను నటుడు సోనూ సూద్ సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపుతున్నారు.. కరోనా సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్య సిబ్బందికి తన హోటల్ ను బస కోసం ఇచ్చేశారు.. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ మానవతా సేవలతో ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. ఆయన మానవత్వానికి యావత్ భారతదేశం ఫిదా అయింది. ఆయను పొగుడుతూ ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరైతే సోనూ సూద్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముంబాయిలోని లోనావాలాలో ఉన్న మ్యూజియంలో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మానవతామూర్తికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు నెటిజెన్స్.. భారతీయుల మనస్సుల్లో సుసిస్థిత స్థానాన్ని సంపాదించుకున్న సోనూసూద్ కు ఈ విధంగా ఆత్మీయ గౌరవం దక్కిందని కామెంట్స్ పెడుతున్నారు.. కాగా, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందలూర్, పూనాకు సమీపంలోని లోనావాలాలో 2010లో ఏర్పాటు చేసిన మైనపు విగ్రహాల మ్యూజియంలో సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మైనపు మ్యూజియంలో జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తంగా 100 వరకు సెలబ్రిటీల మైనపు విగ్రహాలున్నాయి. అందులో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం కూడా ఉండడం గమనార్హం. ఎటువంటి స్వార్థం లేకుండా సొంత డబ్బులతో పేదలకు సేవలు చేసిన సోనుసూద్ విగ్రహాన్ని ప్రముఖుల సరసన ఏర్పాటు చేసిన ఆ మ్యూజియమే గౌరవాన్ని దక్కించుకుంది .