లడాఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన సైనిక ఘర్షణపై చైనా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. లడఖ్ సరిహద్దు వద్ద భారత బలగాలు హద్దుమీరినట్లు ఆయన ఆరోపించారు. భారత సైన్యం దూకుడు ప్రదర్శించిందన్నారు. దాని వల్లే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు జావో తెలిపారు. భారత్ తమ బలగాలను హద్దుల్లో పెట్టుకోవాలని, ఏకాభిప్రాయానికి తగినట్లు ఉండాలని జావో సూచించారు. ఫ్రంట్‌లైన్ దళాలు తమ భూభాగంలోకి రాకూడదంటూ చైనా విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. బోర్డర్ లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దన్నారు.గాల్వాన్ వ్యాలీలో జరిగిన తాజా ఘర్షణలో.. రెండు దేశాలకు చెందిన సైనికులు మృతిచెందారు. అయితే చైనా బలగాల్లో ఎంత మరణించిన దానిపై క్లారిటీ లేదు. తొలుత అయిదుగురు చైనా సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చినా.. వాటిని ఆ దేశం కొట్టిపారేసింది. కానీ మృతుల సంఖ్యను వెల్లడింలేదు. భారత్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతిచెందారు. దాంట్లో ఓ కల్నల్ కూడా ఉన్నారు. అయితే గాల్వాన్ వ్యాలీలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు మంతనాలు జరుపుతున్నారు.