చైనా ఘర్షణలో తెలంగాణ ఆర్మీ అధికారి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్బాబు సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. మూడు నెలల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews