భారత సరిహద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ.. నేపాల్ సైన్యం(ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్) సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన భారత పౌరులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని బిహార్‌కు చెందిన రైతు వికేశ్ యాదవ్(22)గా గుర్తించారు. గాయాలపాలైన మరో ఇద్దరిని ఠాకూర్, ఉమేశ్ రామ్‌గా గుర్తించారు.వీరినీ సితామర్హిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఇక్కడ ఇరు దేశాల ప్రజజలు తమ బంధువులను కలిసేందుకు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మూడు ప్రాంతాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్ వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగంగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన వివాదానికి తెర లేపిన విషయం తెలిసిందే.