తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని విమర్శించారు. అది తన ఆస్తి కాదని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారికి న్యాయపరంగా సలహా తీసుకొని సమాధానం ఇవ్వనున్నట్టు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘మీరు విజయవంతమైన మంత్రి. అందుకే రాజకీయ శత్రువులు విసుగు తెప్పిస్తుంటారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా మీరు మంచి పనులను కొనసాగించేందుకు ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మేమంతా మీతోనే ఉన్నాం కేటీఆర్ గారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్ ‘చాలా ధన్యవాదాలు ఎంపీ సాబ్’ అని బదులిచ్చారు.