జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా రంగంలోకి దింపిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల సంఘం ముందు బీజేపీ ధర్నా డ్రామా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పటాన్‌చెరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. 4 ఓట్లు వస్తాయన్న ఆశతో బీజేపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా ఎన్నికల ప్రచారం ఉండాలి కానీ బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ఫేక్ మీడియా నడపడంలో బీజేపీకి నోబెల్ బహుమతి వస్తుందని పేర్కొన్నారు.’దుబ్బాక ఉప ఎన్నికల రోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్టు ఓ ఛానెల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించి వదిలారు. ఈసారి కూడా, నేను, మా కీలక నేతలు పార్టీ మారినట్టు ప్రముఖ ఛానెళ్ల నకిలీ లోగోలతో వీడియోలు తయారు చేయించారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్ధన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు మళ్ళీ ఇక్కడ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయబోతున్నారు. వీటిపై మాకు స్పష్టమైన సమాచారం ఉంది. భాజపా సోషల్ మీడియాను ఫేక్ మీడియగా మార్చింది’ అని హరీష్ ఫైర్ అయ్యారు. ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందన్నారు. బీజేపీ ప్రేస్టేషన్లోకి వెళ్ళిందని, టీఆర్‌ఎస్ శ్రేణులు సంయమనంతో ఉండాలని కోరారు.