బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన కేసుపై విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం..రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకూడదంటూ పేర్కొన్న హైకోర్టు.. జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. జంతు మాంసం ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారాన్ని గుర్తుచేసింది. మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.