ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్‌లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు.డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు.