దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్ లెబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టైప్ 075 అనే ఆంఫీబియస్ అసాల్ట్(ఉభయచర) షిప్పులను రంగంలోకి దించినట్లు సమాచారం. దాదాపు 40 వేల టన్నుల బరువైన టైప్ 075 షిప్ 900 బలగాలను తరలించగల సామర్థ్యం ఉన్న విమాన వాహక నౌక అని, దాదాపు 30 హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలిగే శక్తిసామర్థ్యాలు దీని సొంతమని ఇటీవల విడుదలైన సాటిలైట్ ఫొటోగ్రాఫ్‌లను అధ్యయనం చేసిన వెస్ట్రన్ మిలిటరీ నిపుణులు పేర్కొన్నారు. అంతేగాక యూఎస్ ఎఫ్-35బీ మాదిరి షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసే పనిలో చైనా నిమగ్నమై ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.కాగా గతేడాది సెప్టెంబరులో తొలి టైప్ 075 షిప్‌ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో షిప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో ఆంఫీబియస్ షిప్ నిర్మాణంలో ఉందని, మొత్తంగా ఇలాంటివి ఏడు షిప్పులు తయారు చేయనున్నట్లు చైనా మిలిటరీ అధికారిక ప్రెస్‌మీట్‌లో వెల్లడించింది. వీటి ద్వారా ఇదిలా ఉండగా.. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం సాధించేందుకు డ్రాగన్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బలగాలకు దీటుగా బదులిచ్చేందుకు నావికా దళ బలగాలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు 2017లో దాదాపు 10 వేల మెరైన్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 25 నుంచి 35 వేలకు చేరిందని అమెరికా, జపాన్ మిలిటరీ ఈ మేరకు అంచనా వేశాయి. ఇక దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన డ్రాగన్ పొరుగు దేశాలను బెదిరింపులకు గురిచేస్తోందని అమెరికా మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ సర్కారు అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళం సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్‌సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్‌సీ)కు చెందిన నౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి.