చైనాను ప్రపపంచంలోని ఒక్కో దేశమూ పక్కన పెట్టేస్తున్నాయి. ఆ దేశ టెలికాం కంపెనీలను మెళ్లమెళ్లగా తప్పించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పుందన్న ఆ దేశ ఎంపీల ఆందోళన నేపథ్యంలో దేశ 5జీ నెట్‌వర్క్ నుంచి చైనాకు చెందిన హువావే టెలికాం సంస్థను దశలవారీగా పక్కకు జరిపేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయంచినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. హువావే, జెడ్‌టీఈ కార్ప్ సంస్థలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సైనిక పరికరాలతో సంబంధం ఉందని, వీటితో జాతీయ భద్రతకు ప్రమాదముందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా, ఈ నిషేధం కొన్ని నెలల్లో అమల్లోకి రానుంది. ఇదిలా ఉండగా, 5జీ నెట్‌వర్క్‌ల నుంచి హువావేను దశలవారీగా తొలగించే నిర్ణయం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలని చైనా నిర్ణయం యూకే, దాని ఇతర మిత్రదేశాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఏడాది జనవరిలోనే యూకే 5జీ నెట్‌వర్క్‌లో హువావే పరిమిత పాత్ర పోషించేలా జాన్సన్ ఆదేశాలు జారీచేశారు.