కరోనాతో ప్రపంచం అల్లాడుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని.. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. మీడియాలో వస్తున్న నెగెటివ్ వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని… అందుకే కరోనా రోగిని వెలివేసే విధానం సమాజంలో ఏర్పడిందని అజయ్ తెలిపారు. తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ఇదే సమయంలో మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వాల వైఫల్యం ఉండదని, ఈ అంశంపై విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. విమర్శించే వాళ్లకు బుద్ధి లేదని చెప్పారు. కరోనా విషయంలో అలర్ట్ చేయండంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తనకు కరోనా వచ్చినా భయపడనని… గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతానని చెప్పారు.