తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చైనా హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను హెచ్చరించింది. ‘గత ఆర్నెళ్లుగా 1772 మంది మరణించారు. ఒక్క జూన్ నెలలోనే 628 మంది మృతి చెందా రు. ఇందులో చైనీయులు కూడా ఉన్నారు. కజకిస్థాన్ ఆరోగ్య శాఖ వర్గాలు వైరస్ ఆనవాలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్త’అని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు గ్లోబల్ టైమ్స్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే చైనా ప్రకటనపై కజికిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. చైనా మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ‘కజకిస్థాన్‌లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచురించిన సమాచారం సరైంది కాదు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. బాక్టీరియా, ఫంగల్, వైరల్ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని, తాము డబ్లుహెచ్‌ఓ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.