పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాక్ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్ రవాణా శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ పైలట్ల విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది. పాక్ పైలట్లలో మూడో వంతు మందివి నకిలీ సర్టిఫికెట్లని గత నెలలో తేలింది. పీఐఏపై యూఎస్ నిషేధాన్ని పాక్ జయో న్యూస్ ధృవీకరించింది. యూరోపియన్ యూనియన్ పీఐఏపై ఇప్పటికే నిషేధం విధించింది. ఆరు నెలలపాటు ఈయూకు అంతర్జాతీయ విమానాలు నడపడానికి వీళ్లేదని పేర్కొంది. పాకిస్థాన్‌లోని కరాచీలో విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో పీఐఏ జెట్ విమానం కూలడంతో మే 22న 97 మంది మరణించిన విషయం తెలిసింది. ఆ విమానం నడిపిని పైలట్లవి కూడా నకిలీ సర్టిఫికెట్లేనని తేలింది.