రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే విషయంలోనూ అంతే కఠినంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి పోలీసులు ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. మాస్కు ధరించని వారిపై సెక్షన్ 51(బి) ప్రకారం.. కేసుతో పాటు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అమర్చిన సీసీ కెమెరాల ద్వారా మాస్కులు లేకుండా సంచరించినా, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించకుండా గుమిగూడినా.. కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు రాష్ట్రవ్యాప్తంగా 67 వేలకు పైగా ఉన్నాయి. ఇక మాస్కు ధరించని మూడువేలకుపైగా వ్యక్తులకు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. కోవిడ్ కేసులు పెరిగేందుకు ఎన్ని కారణాలు ఉన్నా.. మాస్కు ధరించకపోవడం అన్నింటి కంటే ప్రాథమికమైంది. అందుకే, ఇకపై సీసీ కెమెరాలతో పాటు, నేరుగానూ కేసులు బుక్ చేయడంతోపాటు, చలానాలు రాయనున్నా రు. ఈ మేరకు అన్ని స్టేషన్ల ఎస్‌హెచ్‌వో (స్టేష న్ హౌస్ ఆఫీసర్)లకు సందేశాలు వెళ్లాయి. శుభకార్యాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ ర్యాంకు ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని, తీసుకున్నాక కూడా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు.