హైదరాబాద్: లాక్‌డౌన్ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బి)ని ఉల్లంఘించడంలో ఎప్పటిలాగే హైదరాబాదీలు ముందున్నారు. మార్చి 22 నుంచి ఈ చట్టం అమలవుతుండగా.. జూలై 1 వరకు మాస్కులు పెట్టుకోని వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు 67,557 కేసులు నమోదు చేశారు. సామాజిక దూరం పాటించకపోవడం, లాక్‌డౌన్ వేళల్లో అకారణంగా బయట తిరగడం వంటి కారణాలతో ఈ కేసులు నమోదయ్యాయి.ఇందులో హైదరాబాద్ 14,346 కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఖమ్మం కమిషనరేట్ (6,372 కేసులు) ఉంది. జూన్ 20 నుంచి మాస్కు పెట్టుకోకపోతే పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,288 మందికి చలానాలు విధించారు. వీరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అమర్చిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మాస్కు ఉల్లంఘనల్లో వనపర్తి జిల్లా 846 కేసులతో తొలి స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ 585 కేసులతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.