థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019 సెప్టెంబర్‌లో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు వోచర్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఇది తెలుసుకున్న కస్టమర్లు వోచర్లను కొనుగోలు చేశారు. వోచర్లు పొందిన వారంతా రెస్టారెంట్లకు వెళితే రెస్టారెంట్ యజమానులు మాత్రం ఆ వోచర్లు చెల్లవంటూ చేతులెత్తేశారు.డిస్కౌంట్ వస్తుందన్న ఆశతో వోచర్లు కొనుక్కుంటే ఇప్పుడు చెల్లవంటే ఎలా కుదురుతుందంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రెండు రెస్టారెంట్ల ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, తాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు ఒప్పుకొన్నారు. దీంతో వారి శిక్షను 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటు 58,500 డాలర్ల జరిమానా విధించింది. అయితే, థాయిలాండ్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల కావొచ్చు.