గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ’గోదావరి జల దీక్ష’పై డీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో గాంధీభవన్ నుంచి ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి శనివారం దీక్షలు చేయాలని, స్థానిక మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలియజేయాలని ఉత్తమ్ పార్టీ నేతలను కోరారు.