జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పాలనలో బిహార్ రాష్ట్రం జంగిల్‌రాజ్ నుంచి జనతారాజ్ వైపు పయనిస్తోందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్‌షా ఆదివారం వర్చువల్ ర్యాలీలో బిహార్ ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) హయాంలో బిహార్‌లో వృద్ధిరేటు కేవలం 3.9 శాతం ఉండేదని, ప్రస్తుతం ఎన్డీయే పాలనలో అది 11.3 శాతానికి పెరిగిందని తెలిపారు.బిహార్ లాంతరు రాజ్యం(ఆర్జేడీ గుర్తు లాంతరు) నుంచి ఎల్‌ఈడీ రాజ్‌గా ఎదుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వర్చువల్ ర్యాలీ చేపట్టడం లేదని, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రారంభించామని అమిత్ షా చెప్పారు. ఇలాంటివి 75 కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బిహార్ సంక్షేమం కోసం సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కష్టపడి పనిచేస్తున్నారని, అయినా వారు ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదని కొనియాడారు. అమిత్‌షా వర్చువల్ ర్యాలీని వ్యతిరేకిస్తూ బిహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల గిన్నెలు, పళ్లాలు మోగిస్తూ చప్పుళ్లు చేశారు. శంఖాలు ఊదారు.