కేరళ ఏనుగు ఘటన పై కేంద్రం సీరియస్, బాద్యులను కఠినంగా శిక్షించాలని ప్రముఖుల డిమాండ్

కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.
పైనాపిల్‌లో బాంబు పెట్టి ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం, శ్రద్ధాకపూర్‌, రణ్‌దీప్‌ హుడా, తెలుగు నటి ప్రణీత డిమాండ్‌ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ. 50 వేలు ఇస్తామని హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా బహుమతి ప్రకటించింది.
ఆహారం కోసం తిరుగుతున్న ఏనుగు ఓ పండును తిన్నది. అయితే ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండటంతో దాని దవడలు, నోటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధను తాళలేక సమీపంలోని ఓ నదిలోకి దిగింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. ఆహారం లేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో గతనెల 27న ప్రాణాలు విడిచింది. ఏనుగుకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అది నెలరోజుల గర్భిణి అని తేలింది. గాయాలతో ఉన్నప్పటికీ ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. ఈ ఘటనపై కేరళ సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. కేంద్రం రాష్ర్టాన్ని నివేదిక కోరింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews