వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తోంది. అకాల వర్షాలు రాక ముందే పంటకోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలి. దేశ జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా 23శాతం ఉంది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. తెలివి ఉంటే బండమీద కూడా నూకలు పుట్టించుకోవచ్చు. కరెంటు, రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్యసంపద, ఇలా ప్రతీరంగంలో దేశమే ఆశ్చర్యపోయేలా ప్రగతిని తెలంగాణ నమోదు చేసింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు.మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర అంటున్నది. కానీ, తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు. 2021-2022 ముందు జీఎస్టీ ఆదాయం రూ.34వేల కోట్లు ఉంటే అంచనాలు 44వేల కోట్లు పెట్టుకున్నాం. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించాం. వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునుపటికన్నా ఎక్కువ సీట్లు రావాలన్నదే ప్రాధాన్యత అంశం. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.