2023 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓవైసీని శరణు కోరినా కేసీఆర్ ఈ ఓటమి నుంచి తప్పించుకోలేరన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో విజయం సాధించి నరేంద్ర మోదీ జోలెలో వేయబోతున్నామన్నారు. ఆ ఎన్నికల కంటే ముందు జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ పట్టణంలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొన్నారు. అంతకుముందు ఇక్కడి క్రషర్ గ్రౌండ్స్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్, గిరిజన పోరాట యోధులు రాంజీ గోండు, కొమురం భీమ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అనంతరం సభలో మాట్లాడారు.గత లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచాక, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడింది. మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతున్నందున తెలంగాణలో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాలేదు. తెలంగాణ గౌరవ, ప్రతిష్టలను కాపాడేది బీజేపీ మాత్రమే. ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ గౌరవం కలకాలం నిలిచేలా పార్టీ చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధికి, దళితులు, అమాయక గిరిజనులు, బడుగు.. బలహీనవర్గాలు, మహిళలు, యువతులు, పిల్లల భద్రత, రక్షణకు కృషి చేస్తుంది..’అని హామీ ఇచ్చారు.